Friday, 15 January 2021

WHO IS SANKRANTI WINNER?

 సంక్రాంతి విజేత ఎవరు?

టాలీవుడ్‌లో సంక్రాంతికి సినీ సందడి అంటే మాములుగా ఉండదు. అందుకే ఈ పండగకు పెద్ద, చిన్న సినిమాలు సుమారు నాలుగైదు విడుదలవుతాయి. అయితే ఈ సారి 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా పెద్ద హీరోల చిత్రాలు బరిలో లేకపోయినా రవితేజ, రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటితో పాటు డబ్బింగ్ మూవీ ‘మాస్టర్’ కూడా జత కలిసింది. 

ఈ సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు విడుదలయ్యాయి. క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్, సైకిల్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో మహత్ రాఘవేంద్ర, పునర్నవి భూపాళం నటించిన  ‘సైకిల్’ చిత్రం మెట్రో సిటీలలో మాత్రమే విడుదలైంది. అయినా ఈ చిత్రాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ సినిమా గురించి పక్కన బెడితే మిగతా నాలుగు సినిమాలలో ఏది విజేతగా నిలిచిందో చూద్దాం.

ముగ్గుల పండక్కి విడుదలైన తొలి చిత్రం రవితేజ ‘క్రాక్’. తొలిరోజు కొన్ని కారణాల వల్ల మూడు షోలు రద్దయినా పడింది ఒక్క షోనే అయినా ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. రవితేజ నటన, మాస్ ఎలివేషన్స్, ఫైట్లు, పాటల కారణంగా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. యావరేజ్ రేటింగ్ కూడా 2.75 సంపాదించింది. ఇక మాస్టర్ డబ్బింగ్ సినిమానే అయినా తొలిరోజు వసూళ్లు బాగానే రాబట్టింది. కానీ రొటీన్ మాస్ సినిమా అనే టాక్ వచ్చేసరికి ఆ తర్వాత కలెక్షన్లు నెమ్మదించాయి. రామ్ ‘రెడ్’ కూడా అనుకున్నంత టాక్ తెచ్చుకోలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ ఓటీటీలకు ఎక్కువ అని సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు. ఇక ‘అల్లుడు అదుర్స్’ సంగతి సరేసరి. అనుకోకుండా ఈ పండక్కి పోటీలోకి వచ్చిన ఈ సినిమా పరమ రొటీన్ కామెడీ అని టాక్ తెచ్చుకుంది. కందిరీగ ఫార్ములాను అటు తిప్పి ఇటు తిప్పి ప్రేక్షకుల మీదకు సంతోష్ శ్రీనివాస్ వదిలాడనే రిమార్క్ సంపాదించుకోవడంతో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వీకెండ్ దాటితే కానీ ఈ సినిమా పరిస్థితిపై అంచనా వేయలేం. 

ఈ నాలుగు సినిమాల్లో సంక్రాంతి హిట్ నిస్సందేహంగా ‘క్రాక్’ సినిమానే. తొలి ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సంపాదించిన ఈ మూవీకి ఆరో రోజు వచ్చే కలెక్షన్లు అన్నీ లాభాలే. 50 శాతం ఆక్యుపెన్సీతో తొలి 5 రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిన ఈ సినిమా రేంజ్ గురించి ఇంకా చెప్పేదేముంది. రవితేజకు ‘రాజా ది గ్రేట్’ తర్వాత నిఖార్సైన హిట్ ఇదే. మొత్తానికి కరోనాకు కూడా ‘క్రాక్’ పుట్టించిన సినిమా ఇది. మాస్ మహారాజ్ రవితేజ తర్వాత గోపీచంద్ మలినేని, తమన్ ఈ సినిమా విజయంలో కీలకపాత్ర వహించారు.



Thursday, 14 January 2021

RAM ‘RED’ MOVIE REVIEW


 

రేటింగ్: 2.75/5

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన సినిమా ‘రెడ్’. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో అందరూ అతడి నటనే గురించే మాట్లాడతారు. ముఖ్యంగా ఈ సినిమాను వన్‌మ్యాన్ షోగా మార్చేశాడు. తమిళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ స్క్రీన్‌ప్లేపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ఇక కథలోకి వెళ్తే.. రామ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. సిద్ధార్థ్‌ పాత్రలో ఇంజినీర్‌గా, ఆదిత్య పాత్రలో ఆవారాగా నటించాడు. వీరిద్దరూ కవలలు. అయితే ఆకాష్ అనే వ్యక్తి మర్డర్ కేసులో సిద్ధార్థ్ అరెస్ట్ అవుతాడు. ఇదే కేసులో ఆదిత్య పాత్ర కూడా ఉందని తేలుతుంది. ఇంతకీ ఆకాష్‌ను ఎవరు, ఎందుకు మర్డర్ చేశారన్నదే మిగతా కథ.

ఆదిత్య, సిద్ధార్థ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లతో ఫస్టాఫ్‌ ఏదో సోసోగా సాగగా సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాను ఇంట్రెస్టింగ్‌గా మార్చింది. అయితే సెకండాఫ్ మొత్తం సీరియస్ మోడ్‌లో సాగుతుంది. సినిమాలో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలు ఉండటం మైనస్‌గా మారాయి. యామిని పాత్ర హీరోకు ఎందుకు సహాయం చేస్తుందో క్లారిటీగా చెప్పాల్సింది. క్లైమాక్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది. లవ్ ట్రాక్, కామెడీ పండలేదు.

విభిన్న పాత్రల్లో రామ్ చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. ముందే చెప్పుకున్నట్లు ఆ రెండు పాత్రల చుట్టే సినిమా ముందుకు సాగుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా యామిని పాత్రలో నివేదా పెతురాజ్, మహిమ పాత్రలో మాళవిక శర్మ నటన ఫర్వాలేదు. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మ మరోసారి మ్యాజిక్ చేశాడు. నువ్వే నువ్వే పాటతో పాటు ఈ మూవీకి మంచి బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. కొన్ని సన్నివేశాలు ఏదో తూతూమంత్రంగా తక్కువ ఖర్చుతో తీశారనిపించింది.

చివరగా తమిళ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. కానీ కిషోర్ తిరుమల స్క్రీన్‌ప్లేతో పూర్తిగా ఎంగేజ్ కాలేం. సస్పెన్స్ థ్రిల్లర్లు గ్రిప్పింగ్‌గా ఉంటేనే మంచి విజయం సాధిస్తాయి. ట్విస్టులు ముందే తెలిసిపోతే కథలోకి లీనం కాలేం. అదే ఈ సినిమాలో మైనస్. రామ్ కోసం అయితే ఒక్కసారి ఈ సినిమాను తప్పనిసరిగా చూడొచ్చు.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: మిరాజ్ సినిమాస్ (చందానగర్)

Wednesday, 13 January 2021

VIJAY ‘MASTER’ MOVIE REVIEW

 

విజయ్ ‘మాస్టర్’ మూవీ రివ్యూ

రేటింగ్: 2.5/5

తమిళ అగ్రహీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజ్ ఈ మూవీకి దర్శకుడు. ఖైదీ సినిమాలో కథ, కథనాలకు ప్రాధాన్యమిస్తూ హీరోయిజాన్ని అండర్‌ప్లే చేసిన దర్శకుడు ఈ సినిమాలో మాత్రం కథనాన్ని గాలికొదిలేశాడు. విలన్ పాత్రపై ఉన్న శ్రద్ధ స్క్రీన్‌ప్లేపై కనిపించలేదనిపిస్తే అతిశయోక్తి కాదు.

కథ విషయానికొస్తే జేడీ (విజయ్) ఓ కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. కాలేజీ యాజమాన్యానికి అతడు అంటే పడదు కానీ విద్యార్థుల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కానీ ఓ గొడవ కారణంగా సదరు కాలేజీని విడిచిపెట్టి జువైనల్ హోంలో మాస్టర్‌గా చేరతాడు. బాలనేరస్తులను అడ్డుపెట్టుకుని నేరాలు చేసే భవానీ (విజయ్ సేతుపతి)తో జేడీ కయ్యానికి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

ఈ సినిమాలో మంచి కథ ఉంది. పాటలు మాస్‌ను అలరించేలా ఉన్నాయి. హీరో ఎలివేషన్, విలన్ పాత్ర బాగున్నాయి. ఎటొచ్చీ కథనం ఫ్లాట్‌గా ఉండటమే ఈ సినిమాకు మైనస్‌గా మారింది. తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చితే వింతేమీ లేదు కానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే విజయ్ అంటే తెలుగులో అంత ఫాలోయింగ్ లేదు. కమర్షియల్ ఎంటర్‌టైనర్లు తీయడానికి మన దగ్గర చాలామంది హీరోలు ఉన్నారు. తమిళ్ సినిమా అనగానే మనోళ్లు కథ, కథనాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఫస్టాఫ్ వరకు ఈ సినిమా బాగుంది అనిపించినా సెకండాఫ్ రొటీన్‌గా సాగడంతో ఈ మూవీ గ్రాఫ్ పడిపోయింది.

పాత్రల విషయానికొస్తే విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఊర మాస్ పాత్రలో అతడు బాగా నటించాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర పెద్ద ఎస్సెట్. భవానీ పాత్ర ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. అందులో విజయ్ సేతుపతి అదరగొట్టాడనే చెప్పాలి. హీరోయిన్ మాళవిక మోహన్ చూడటానికి బాగానే ఉంది. కానీ ఆమెకు సినిమాలో అంత స్కోప్ లేదు. అనిరుధ్ స్టార్ సినిమాకు కావాల్సిన మ్యూజిక్, బీజీఎం బాగా ఇచ్చాడు. డైలాగ్స్ తమిళం నుంచి తర్జుమా చేశారనిపించేలా ఉంది. తెలుగు వెర్షన్‌లో కొన్ని డైలాగులు మారిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా.. ఇటీవల వచ్చిన క్రాక్ సినిమాలోనూ మాస్ ఎలివేషన్స్ బాగున్నాయి. అది అచ్చ తెలుగు సినిమా కాబట్టి ఏదోలా పాస్ అయిపోయింది. కానీ తమిళం నుంచి అరువు వచ్చిన ఈ సినిమాలో కూడా మాస్ ఎలివేషన్స్ అలానే ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనే దానిపై ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంది. రొటీన్ మాస్ మసాలా కోరుకునేవారికి ఈ సినిమా టైమ్ పాస్ అయిపోతుంది కానీ మిగిలిన వారి సంగతి కూడా దర్శకుడు పట్టించుకుంటే బాగుండేది. ఖైదీలో భావోద్వేగాలు పండగా ఈ సినిమాలో ఆ అంశమే మిస్ ఫైర్ అయింది.

A REVIEW WRITTEN BY NVLR

THEATER WATCHED: శివపార్వతి (కూకట్‌పల్లి)




Saturday, 9 January 2021

RAVITEJA ‘CRACK’ MOVIE REVIEW

 రవితేజ ‘క్రాక్’ మూవీ రివ్యూ



రేటింగ్: 2.75/5

రవితేజ అంటేనే మాస్. మాస్ అంటేనే రవితేజ. అందుకే అతడికి మాస్ మహరాజ్ అని బిరుదు కూడా ప్రేక్షకులు ఇచ్చేశారు. సంక్రాంతికి అతడు వస్తున్నాడంటే ఎంతో ఆసక్తి చూపించారు. కానీ తొలిరోజు వరుసగా మూడు ఆటలు రద్దు అయ్యేసరికి ఏ మూలో ఓ నిరాశ. కానీ సెకండ్ షోలు ప్రదర్శించాక మాస్ అభిమానులు ఉరకలెత్తారు. ఈ విశ్లేషణతో ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉందో? ఫుల్ మాస్ ప్యాక్‌డ్ మూవీ అని.

ఇక కథలోకి వెళ్తే రవితేజ (వీర శంకర్) ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్. దీంతో అతడికి వేర్వేరు నగరాల్లో ముగ్గురు విలన్‌లు ఉంటారు. వీరిలో సముద్రఖని (కటారి) శక్తివంతమైనవాడు. అతడంటే చుట్టుపక్కల గ్రామాల వారు భయపడుతుంటారు. అసలు కటారితో వీరశంకర్‌కు గొడవ ఎందుకు? తన సహ ఉద్యోగి కుమారుడి చావుకు కారణమైన కటారిని వీరశంకర్ ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ.

ఈ సినిమాలో కథ అంతా రవితేజ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. రవితేజ కూడా గత సినిమాల్లో కాకుండా ఈ మూవీలో తన పాత్రలో లీనమై హుషారుగా కనిపించాడు. అతడిలో ఫైర్ స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాకు ముమ్మాటికీ అతడే ప్లస్ పాయింట్. రవితేజ తర్వాత సినిమాలో కీలకపాత్ర సముద్రఖనిదే. విపరీతమైన బిల్డప్‌తో ఆ పాత్రను పరిచయం చేస్తారు. జయమ్మ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫర్వాలేదు. కానీ హీరోయిన్ శ్రుతిహాసన్ కేవలం పాటలకే పరిమితమైంది. ఈ మూవీలో శ్రుతి చాలా అసహజంగా కనిపిస్తుంది. ఆమెలో ఛార్మ్ కనిపించలేదు. 

కథా నేపథ్యం కోసం హీరో వెంకటేష్ వాయిస్ ఇవ్వడం ఆకట్టుకోగా వేటపాలెం బీచ్ సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. కానీ కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమా గ్రాఫ్‌ను తగ్గిస్తాయి. సినిమా మొదట్లో రవితేజతో కామెడీ చేయించాలా లేదా మాస్ చేయించాలా అన్న కన్‌ఫ్యూజన్ దర్శకుడిలో స్పష్టంగా కనిపించింది. తమన్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. అతడి పాటలు చాలా హుషారుగా ఉన్నాయి. బీజీఎం కూడా బాగుంది. రామ్-లక్ష్మణ్ యాక్షన్ సీన్లు బాగున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని రెగ్యులర్ సబ్జెక్టునే ఎంచుకున్నా ఏదో కొత్తదనం కోసమైతే ప్రయత్నించాడు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. రవితేజ-శ్రుతిహాసన్ ఫ్యామిలీల మధ్య సన్నివేశాలు, సెకండాఫ్‌లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఎడిటింగ్‌లో తీసేస్తే బాగుండేది. ఆది, అవినాష్, సప్తగిరి ఉన్నా కామెడీ అంతంతమాత్రమే.

చివరగా ఈ సినిమా టార్గెట్ మాస్ ఆడియన్స్ కాబట్టి యాక్షన్‌కు అయితే కొదువ లేదు. మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్‌లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఈజీగా పాస్ కావడానికి అవకాశాలున్నాయి. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలతో పాటు ప్రేక్షకులు మాస్ సినిమాలకు కూడా ఓటు వేస్తుంటారు. రవితేజ కోసం తప్పనిసరిగా ఈ సినిమాను చూడొచ్చు.


A REVIEW WRITTEN BY NVLR

THEATER WATCHED: శ్రీరాములు (మూసాపేట)

Tuesday, 22 December 2020

పవన్-రానా మూవీకి మెగాస్టార్ సినిమా టైటిల్


పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి పాత సినిమా టైటిల్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళం మూవీ ‘అయ్యప్పనుమ్-కోషియం’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు ‘బిల్లా-రంగా’ టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ టైటిల్‌‌తో గతంలో (1982) మెగాస్టార్ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తి కానుంది. అది పూర్తయిన వెంటనే ఆయన బిల్లా-రంగా మూవీ చిత్రీకరణలో పాల్గొననున్నాడు.

ఈ సినిమాలో బిల్లాగా పవన్, రంగా పాత్రలో రానా నటించనున్నారు. ఇక ఈ మూవీలో రానా సరసన నివేదా పెతురాజ్ నటించే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో టాక్ వినపడుతోంది. ‘అల వైకుంఠపురంలో’ బన్నీ మరదలి పాత్రలో ఆమె మెప్పించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.


Saturday, 19 December 2020

DIRTY HARI MOVIE REVIEW


‘డర్టీ హరి’ మూవీ రివ్యూ: వారెవ్వా ‘హరీ’

రేటింగ్: 3/5

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఎం.ఎస్.రాజు ‘డర్టీ హరి’ అనే బోల్డ్ సినిమా తీశాడంటే అందరూ ఆశ్చర్యపోయారు. హిట్ కోసం ఆయన దిగజారాడని కామెంట్లు కూడా వినపడ్డాయి. కానీ ఈ సినిమా చూస్తే ఎం.ఎస్.రాజు పనితనం గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ నిలవడం ఖాయం.

ఇక కథగా చెప్పాల్సి వస్తే హరి (శ్రవణ్‌రెడ్డి) తన ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఓ గొప్పింటి అమ్మాయి వసుధ (రుహానీ శర్మ) ప్రేమలో పడతాడు. మరోవైపు వసుధ సోదరుడి లవర్ జాస్మిన్ (సిమ్రత్ కౌర్) ఆకర్షణలో కూడా పడి రొమాన్స్ చేస్తాడు. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. దీంతో హరి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది మిగతా స్టోరీ.

ఈ సినిమాలో రొమాన్స్ పెద్ద ఆకర్షణగా నిలవడంతో యూత్‌కు నచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. హరి, జాస్మిన్ అనే రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ఆధారంగా తీసిన ఈ మూవీలో హరికి ఎదురైన సమస్యలను దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు. వల్గారిటీని అతడు ఎమోషన్స్‌తో కవర్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ సినిమాను హిట్‌ మూవీగా నిలిపేందుకు దోహదం చేశాయి.

నటీనటుల విషయానికి వస్తే తొలి సినిమానే అయినా శ్రవణ్‌రెడ్డి చక్కగా నటించాడు. హరి పాత్రలో అభినయంతో పాటు బోల్డ్‌గా నటించాడు. చివరి అరగంటలో అతడి నటన బాగుంది. హీరోయిన్ సిమ్రత్ కౌర్ ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్. ఆమె ఇలాంటి పాత్ర ఒప్పుకున్నందుకు అభినందించి తీరాల్సిందే. రుహానీ శర్మ తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఆమెకు మరిన్ని సన్నివేశాలు పడితే బాగుండేది.

సాంకేతిక వర్గం తీరు పరిశీలిస్తే ఈ సినిమాకు ఎం.ఎస్.రాజు దర్శకత్వ ప్రతిభ వెన్నుదన్నుగా నిలిచింది. నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. రాబిన్ అందించిన బీజీఎం సూపర్చ్‌గా ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లోనూ ఈ సినిమా చాలా బాగుంది. అయితే కొన్ని చోట్ల సినిమా సాగదీసి ఉన్నట్లు ఉండటం మైనస్ పాయింట్.

ఫైనల్‌గా ‘ఫ్రైడే మూవీస్’ అనే ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) ప్లాట్‌ఫాంపై విడుదలైన ఈ సినిమాను రూ.120 టిక్కెట్ పెట్టి చూడటం దండగేమీ కాదు. బోల్డ్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులకు పైసావసూల్ అనిపిస్తాయి. 


A REVIEW WRITTEN BY NVLR

Thursday, 17 December 2020

బిగ్‌బాస్-4 ఫినాలే అతిథి మళ్లీ మెగాస్టారే


‘బిగ్‌బాస్-4’ ఫైనల్ ఎపిసోడ్‌పై క్లారిటీ వచ్చేసింది. చిరంజీవి లేదా మహేష్, ఎన్టీఆర్‌లలో ఒకరిని ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు నిర్వాహకులు తీసుకువస్తారన్న వార్తల నేపథ్యంలో మెగాస్టార్‌నే ఆ అవకాశం వరించింది. ఆయన బిగ్‌బాస్ ఫైనల్‌కు రావడం ఇది రెండోసారి. మూడో సీజన్‌ ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు.. రాహుల్ సిప్లీగంజ్‌కు ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం జెమినీ టీవీకి ఓ షోకు యాంకర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌కు అతిథిగా వచ్చే అవకాశం లేకపోయింది. మహేష్ కూడా ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న కారణంగా చిరంజీవితో ట్రోఫీ ఇప్పిస్తే గౌరవంగా ఉంటుందన్న ఉద్దేశంతో నిర్వాహకులు మళ్లీ ఆయనకే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్‌గా మూడు గంటల పాటు సాగనుంది. అభిజిత్ ఈ సీజన్ విన్నర్‌గా నిలుస్తాడని సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా సమాచారం అందుతోంది.

అలీ అందుకే నిర్మాతగా మారాడా?


 టాలీవుడ్‌లో బ్రహ్మానందం తర్వాత స్టార్ కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది అలీనే. అతడు హీరోగానూ కొన్ని సినిమాలు చేసినా సునీల్ తరహాలో కాకుండా కమెడియన్‌గానూ సమాంతరంగా నటించాడు. అంతేకాకుండా బుల్లితెరపైనా అలీ తన హవా కొనసాగిస్తున్నాడు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమం ఎంతో పాపులారిటీ సాధించింది. ఎస్పీ బాలుతో ఇంటర్వ్యూ తర్వాత ఆ షో రేంజ్ పెరిగిందని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ మధ్య అతడికి సినిమాల్లో అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. ఓ సినిమా ఫంక్షన్‌లో అలీకి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని పోసాని వ్యాఖ్యలు దీనికి నిదర్శనం.

దీంతో అలీ నిర్మాతగా అవతారమెత్తాడు. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తన స్నేహితుడు శ్రీపురం కిరణ్‌ను దర్శకుడిగా మార్చి ఈ సినిమాను అలీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అలీతో పాటు సీనియర్ నరేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అలీ కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సి ఉంది.


ఎన్టీఆర్‌కు జెమినీ టీవీ భారీ పారితోషికం


 జూ.ఎన్టీఆర్ యాంకర్‌గా మారి చేసిన బిగ్‌బాస్-1 షో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మరోసారి యాంకర్‌ పాత్ర పోషించబోతున్నాడు. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానుందని తెలిసిన విషయమే. రెండు నెలల్లో ఈ షో చిత్రీకరణ ప్రారంభం కానుంది. క్విజ్ మాదిరిగా ఉండనున్న ఈ షోకు జూ.ఎన్టీఆర్ భారీ పారితోషికం తీసుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది.

60 ఎపిసోడ్లుగా ఈ క్విజ్ షోను నిర్వాహకులు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.18 కోట్లు ఎన్టీఆర్‌కు అందనున్నాయి. తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఏ నటుడికి ఇంత పారితోషికం అందలేదని టీవీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఈ షో వల్ల ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆలస్యమయ్యే అవకాశముంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Wednesday, 16 December 2020

KBC: రూ.30 లక్షలు గెలిచిన బుడతడు


టెలివిజన్ తెరపై ఎన్ని షోలు ఉన్నా.. కేబీసీ రూటే వేరు. ఆ షోను ఎవరైనా చూసి తీరాల్సిందే. తెలివి ఉంటే చాలు.. కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఎవరినైనా కోటీశ్వరుడిని చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. గుజరాత్‌కు చెందిన అన్‌మోల్ శాస్త్రి అనే 14 ఏళ్ల బాలుడు బిగ్‌బీ అమితాబ్ అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్నాడు. మరో ప్రశ్నకు సమాధానం చెప్పి ఉంటే రూ.50 లక్షలు గెలుచుకునేవాడే కానీ లైఫ్ లైన్లు లేకపోవడంతో అది సాధ్యపడలేదు. అయితే అమితాబ్ మనసును మాత్రం దోచుకున్నాడు. ఈ బాలుడి తెలివికి ఫిదా అయిన KBC స్పాన్సర్ మరో రూ.5 లక్షలు బహుమతిగా ఇవ్వడంతో మొత్తం రూ.30 లక్షలను గెలుచుకున్నాడు 

ఈ బుడతడికి అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టమట. భవిష్యత్‌లో ఖగోళ శాస్త్రవేత్త కావాలన్నదే తన లక్ష్యమట. ఎప్పటికైనా నోబెల్ బహుమతిని గెలుస్తానని అన్‌మోల్ ధీమా వ్యక్తం చేశాడు. అంతే కాదండోయ్ ఈ బాలుడు ‘హౌ ఇట్ వర్క్స్’ అనే యూట్యూబ్ ఛానల్‌ను కూడా నడిపిస్తున్నాడు. దానికి తన వంతు సహకారం అందిస్తానని అమితాబ్ ఆ బాలుడికి హామీ ఇవ్వడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనం కూడా ఈ బుడ్డోడి కల నెలవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.