Saturday, 9 January 2021

RAVITEJA ‘CRACK’ MOVIE REVIEW

 రవితేజ ‘క్రాక్’ మూవీ రివ్యూ



రేటింగ్: 2.75/5

రవితేజ అంటేనే మాస్. మాస్ అంటేనే రవితేజ. అందుకే అతడికి మాస్ మహరాజ్ అని బిరుదు కూడా ప్రేక్షకులు ఇచ్చేశారు. సంక్రాంతికి అతడు వస్తున్నాడంటే ఎంతో ఆసక్తి చూపించారు. కానీ తొలిరోజు వరుసగా మూడు ఆటలు రద్దు అయ్యేసరికి ఏ మూలో ఓ నిరాశ. కానీ సెకండ్ షోలు ప్రదర్శించాక మాస్ అభిమానులు ఉరకలెత్తారు. ఈ విశ్లేషణతో ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉందో? ఫుల్ మాస్ ప్యాక్‌డ్ మూవీ అని.

ఇక కథలోకి వెళ్తే రవితేజ (వీర శంకర్) ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్. దీంతో అతడికి వేర్వేరు నగరాల్లో ముగ్గురు విలన్‌లు ఉంటారు. వీరిలో సముద్రఖని (కటారి) శక్తివంతమైనవాడు. అతడంటే చుట్టుపక్కల గ్రామాల వారు భయపడుతుంటారు. అసలు కటారితో వీరశంకర్‌కు గొడవ ఎందుకు? తన సహ ఉద్యోగి కుమారుడి చావుకు కారణమైన కటారిని వీరశంకర్ ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ.

ఈ సినిమాలో కథ అంతా రవితేజ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. రవితేజ కూడా గత సినిమాల్లో కాకుండా ఈ మూవీలో తన పాత్రలో లీనమై హుషారుగా కనిపించాడు. అతడిలో ఫైర్ స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాకు ముమ్మాటికీ అతడే ప్లస్ పాయింట్. రవితేజ తర్వాత సినిమాలో కీలకపాత్ర సముద్రఖనిదే. విపరీతమైన బిల్డప్‌తో ఆ పాత్రను పరిచయం చేస్తారు. జయమ్మ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫర్వాలేదు. కానీ హీరోయిన్ శ్రుతిహాసన్ కేవలం పాటలకే పరిమితమైంది. ఈ మూవీలో శ్రుతి చాలా అసహజంగా కనిపిస్తుంది. ఆమెలో ఛార్మ్ కనిపించలేదు. 

కథా నేపథ్యం కోసం హీరో వెంకటేష్ వాయిస్ ఇవ్వడం ఆకట్టుకోగా వేటపాలెం బీచ్ సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. కానీ కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమా గ్రాఫ్‌ను తగ్గిస్తాయి. సినిమా మొదట్లో రవితేజతో కామెడీ చేయించాలా లేదా మాస్ చేయించాలా అన్న కన్‌ఫ్యూజన్ దర్శకుడిలో స్పష్టంగా కనిపించింది. తమన్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. అతడి పాటలు చాలా హుషారుగా ఉన్నాయి. బీజీఎం కూడా బాగుంది. రామ్-లక్ష్మణ్ యాక్షన్ సీన్లు బాగున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని రెగ్యులర్ సబ్జెక్టునే ఎంచుకున్నా ఏదో కొత్తదనం కోసమైతే ప్రయత్నించాడు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. రవితేజ-శ్రుతిహాసన్ ఫ్యామిలీల మధ్య సన్నివేశాలు, సెకండాఫ్‌లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఎడిటింగ్‌లో తీసేస్తే బాగుండేది. ఆది, అవినాష్, సప్తగిరి ఉన్నా కామెడీ అంతంతమాత్రమే.

చివరగా ఈ సినిమా టార్గెట్ మాస్ ఆడియన్స్ కాబట్టి యాక్షన్‌కు అయితే కొదువ లేదు. మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్‌లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఈజీగా పాస్ కావడానికి అవకాశాలున్నాయి. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలతో పాటు ప్రేక్షకులు మాస్ సినిమాలకు కూడా ఓటు వేస్తుంటారు. రవితేజ కోసం తప్పనిసరిగా ఈ సినిమాను చూడొచ్చు.


A REVIEW WRITTEN BY NVLR

THEATER WATCHED: శ్రీరాములు (మూసాపేట)

No comments:

Post a Comment