Saturday, 19 December 2020

DIRTY HARI MOVIE REVIEW


‘డర్టీ హరి’ మూవీ రివ్యూ: వారెవ్వా ‘హరీ’

రేటింగ్: 3/5

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఎం.ఎస్.రాజు ‘డర్టీ హరి’ అనే బోల్డ్ సినిమా తీశాడంటే అందరూ ఆశ్చర్యపోయారు. హిట్ కోసం ఆయన దిగజారాడని కామెంట్లు కూడా వినపడ్డాయి. కానీ ఈ సినిమా చూస్తే ఎం.ఎస్.రాజు పనితనం గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ నిలవడం ఖాయం.

ఇక కథగా చెప్పాల్సి వస్తే హరి (శ్రవణ్‌రెడ్డి) తన ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఓ గొప్పింటి అమ్మాయి వసుధ (రుహానీ శర్మ) ప్రేమలో పడతాడు. మరోవైపు వసుధ సోదరుడి లవర్ జాస్మిన్ (సిమ్రత్ కౌర్) ఆకర్షణలో కూడా పడి రొమాన్స్ చేస్తాడు. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. దీంతో హరి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది మిగతా స్టోరీ.

ఈ సినిమాలో రొమాన్స్ పెద్ద ఆకర్షణగా నిలవడంతో యూత్‌కు నచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. హరి, జాస్మిన్ అనే రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ఆధారంగా తీసిన ఈ మూవీలో హరికి ఎదురైన సమస్యలను దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు. వల్గారిటీని అతడు ఎమోషన్స్‌తో కవర్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ సినిమాను హిట్‌ మూవీగా నిలిపేందుకు దోహదం చేశాయి.

నటీనటుల విషయానికి వస్తే తొలి సినిమానే అయినా శ్రవణ్‌రెడ్డి చక్కగా నటించాడు. హరి పాత్రలో అభినయంతో పాటు బోల్డ్‌గా నటించాడు. చివరి అరగంటలో అతడి నటన బాగుంది. హీరోయిన్ సిమ్రత్ కౌర్ ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్. ఆమె ఇలాంటి పాత్ర ఒప్పుకున్నందుకు అభినందించి తీరాల్సిందే. రుహానీ శర్మ తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఆమెకు మరిన్ని సన్నివేశాలు పడితే బాగుండేది.

సాంకేతిక వర్గం తీరు పరిశీలిస్తే ఈ సినిమాకు ఎం.ఎస్.రాజు దర్శకత్వ ప్రతిభ వెన్నుదన్నుగా నిలిచింది. నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. రాబిన్ అందించిన బీజీఎం సూపర్చ్‌గా ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లోనూ ఈ సినిమా చాలా బాగుంది. అయితే కొన్ని చోట్ల సినిమా సాగదీసి ఉన్నట్లు ఉండటం మైనస్ పాయింట్.

ఫైనల్‌గా ‘ఫ్రైడే మూవీస్’ అనే ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) ప్లాట్‌ఫాంపై విడుదలైన ఈ సినిమాను రూ.120 టిక్కెట్ పెట్టి చూడటం దండగేమీ కాదు. బోల్డ్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులకు పైసావసూల్ అనిపిస్తాయి. 


A REVIEW WRITTEN BY NVLR

No comments:

Post a Comment