వెండితెర.. ఓటీటీ.. ప్రేక్షకుల దారెటు?
వెండితెరపై బొమ్మపడి 8 నెలలు దాటిపోయింది. సరిగ్గా లాక్‌డౌన్ సమయాన్ని ఓటీటీలు(ఓవర్ ది టాప్) అందిపుచ్చుకున్నాయి. విదేశాల్లో ఓటీటీల రాజ్యమేలుతున్నా ఇండియాలో ఓటీటీ వేదికలు ప్రేక్షకులకు చేరువ కావడానికి మరో రెండేళ్లు పడుతుందని సినీ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా కరోనా వైరస్ పుణ్యమా అని ఓటీటీలు తమ ఆధిపత్యాన్ని చూపించాయి. ముఖ్యంగా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలను ఆశ్రయించక తప్పలేదు.
అయితే తెలుగులో నాని ‘వి’, సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ మినహాయించి చెప్పుకోదగ్గ సినిమాలు ఓటీటీల్లో రాకపోయినా మిగతా సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, భానుమతి రామకృష్ణ, మిడిల్ క్లాస్ మెలోడీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, అమ్మోరు తల్లి, ఆకాశం నీ హద్దురా, అంధకారం సినిమాలు ఆదరణ పొందాయి. థియేటర్లు లేవు అన్న ఫీలింగ్‌ను ప్రజల నుంచి ఓటీటీలు దూరం చేశాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రేక్షకుల డబ్బులు వృథా కాకుండా కూడా ఓటీటీలు కాపాడాయి.
కరోనా తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఎన్నో ఆంక్షల మధ్య సినిమాలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా ప్రేక్షకులు ఏ మాత్రం థియేటర్ల వైపు వెళ్తారో అన్న సందేహాలు సినీ పండితుల్లో ఉన్నాయి. ఓ వైపు పెరిగిన నిర్వహణ భారాలు, నష్టాలు వెరసి టిక్కెట్ల రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు థియేటర్ల వైపు వెళ్లేందుకు ఎంత ఆసక్తి చూపుతారో వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment