Friday, 29 September 2017

MAHANUBAVUDU MOVIE REVIEW

‘మహానుభావుడు’ రివ్యూ: ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ

రేటింగ్: 3.25/5

ఈ ఏడాది ‘శతమానం భవతి’, ‘రాధ’ సినిమాలతో గెలుపోటములు చవిచూసిన శర్వానంద్ ‘మహానుభావుడు’తో దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జై లవకుశ’, ‘స్పైడర్’ లాంటి సినిమాలతో పోటీ పడుతుండటంతో ఇందులో కంటెంట్‌పై ప్రేక్షకులు అమితాసక్తిని చూపించారు. పండుగ వేళ ఎన్టీఆర్, మహేష్ సినిమాలు ఎంటర్‌టైనింగ్ చేయడంలో విఫలం కావడంతో ‘మహానుభావుడు’పై వారు గంపెడాశలు పెట్టుకున్నారు.

ఇక కథ విషయానికొస్తే హీరోకు ఓసీడీ(ఓవర్ క్లీనింగ్ డిసీజ్) అనే వ్యాధి ఉండటంతో సహజంగానే కామెడీకి ఢోకా లేకుండా పోయింది. దీనికి ప్రేమకథను జోడించడంతో తెరపై వీనులవిందుకు లోటు కనపడలేదు. అయితే ఒకే పాయింట్‌తో కొంచెం సాగదీసినట్లు అనిపించినా వినోదం దానిని తెరమరుగు చేసింది. చివరకు ఓ మంచి ఫీల్‌తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు రావడం ఈ సినిమా హిట్‌కు ప్రధాన పాయింట్‌గా నిలిచింది.

నటీనటుల విషయానికొస్తే శర్వానంద్ తన పాత్రలో జీవించాడు. ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ హీరోయిన్ మెహ్రీన్ ప్రెష్‌లుక్‌లో కనిపించడం సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. వీరిద్దరికి తోడు వెన్నెల కిషోర్ కామెడీ వర్కవుట్ కావడంతో ప్రేక్షకుడికి కావాల్సినంత వినోదం దొరుకుతుంది. తమన్ సంగీతం వైవిధ్యంగా ఉండటంతో పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. దర్శకుడు మారుతి ప్రధానంగా కామెడీనే నమ్ముకోవడంతో కథనం కూడా పండింది.

చివరగా దసరా పండుగకు ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి ఎంటర్‌టైనర్‌గా ‘మహానుభావుడు’ నిలిచింది. పెద్ద హీరోలతో కలిసి వచ్చినా వారి చిత్రాలు తేలిపోవడంతో శర్వానంద్ సినిమా తక్కువ థియేటర్లలో విడుదలైనా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి ఈ మూవీ థియేటర్లు పెరగడం ఖాయంగా కనపడుతోంది.

A REVIEW WRITTEN BY NVLRT
THEATER WATCHED: అర్జున్ (కూకట్‌పల్లి)

 


1 comment: