Friday, 9 September 2016

Jo Achyutananda Review

జ్యో అచ్యుతానంద రివ్యూ: అందం.. ఆహ్లాదం.. ఉద్వేగం..
రేటింగ్: 3.25/5
దర్శకుడిగా మారి మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ ప్రతిభ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే ఫీల్ గుడ్ మూవీని ఆడియన్స్ కు అందించిన అవసరాల.. రెండో సినిమాతో అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పాడు. సున్నిత భావోద్వేగాలతో నిండిన జ్యో అచ్యుతానంద.. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ ను మరో మెట్టు ఎక్కించింది.
ఇక కథ విషయానికొస్తే ఒకే ఇంట్లో ఉండే అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి పడదు. అలాంటి సమయంలోనే వారి ఇంట్లో పైపోర్షన్ లోకి జ్యోత్స్న అనే యువతి అద్దెకు దిగుతుంది. ఇద్దరు అన్నదమ్ములు ఆ అమ్మాయిని పడేయటమే టార్గెట్ గా పెట్టుకుని ఒకరికి తెలియకుండా ఒకరు ప్రపోజ్ చేస్తారు. కానీ ఇద్దరి ప్రేమను జ్యోత్స్న తిరస్కరించడంతో వేరే పెళ్లిళ్లు చేసుకుంటారు. కొన్నాళ్లకు జ్యోత్స్న మళ్లీ వారి జీవితాల్లోకి వస్తుంది.. అప్పుడు అన్నదమ్ములు ఏం చేశారు.. వీరి కథలు ఏ మలుపు తిరిగాయన్నది మిగతా స్టోరీ..
జ్యో అచ్యుతానంద సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే ఎంతో క్లారిటీతో పక్కాగా రాసుకున్న స్క్రిప్ట్ అనే చెప్పాలి. చెప్పుకోవడానికి చాలా చిన్నదిగా, సింపుల్‌గా కనిపించే కథనే సినిమాగా మలచడంలో స్క్రీన్‌ప్లేతో చేసిన మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి అరగంటలో ఒకే కథను రెండు కోణాల్లో చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ అదే కథను దర్శకుడి కోణంలో మొదలుపెట్టడం ఇవన్నీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిపెట్టాయి.సెకండాఫ్ లో కథ కొంచెం స్లో అయినప్పటికీ క్లైమాక్స్ మళ్లీ సినిమాను నిలబెట్టింది.
నటీనటుల విషయానికొస్తే నారారోహిత్, నాగశౌర్య నిజమైన అన్నదమ్ముల్లా ఈసినిమాలో ఒదిగిపోయారు. అదే ఈసినిమాకు దన్నుగా నిలిచింది.నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ఈ ముగ్గురి మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. దర్శకుడిగా, రచయితగా అవసరాల ఆకట్టుకున్నాడు, సినిమా ఆద్యాంతం డైలాగులతో, సన్నివేశాల్లో వచ్చే కన్ఫ్యూజన్‌తో పుట్టించిన కామెడీ కట్టిపడేసేలా ఉంది. కళ్యాణి కోడూరి పాటలు ఆహ్లాదంగా, అందంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది.మనమంతా సినిమా తర్వాత వారాహి చలనచిత్రం బ్యానర్ నుంచి మరో మంచి చిత్రం వచ్చింది.
ఓవరాల్ గా కమర్షియల్ సినిమాల్లో కామెడీ చూసి విసిగిపోయినవారికి జ్యో అచ్యుతానందలో కామెడీ చూసి వారెవ్వా అనక మానరు. హ్యూమర్ అంటే ఇలానే ఉండాలి.. అవసరాల లాంటి డైరెక్టర్లు ఇలాగే సినిమాలు తీస్తుండాలని కోరుకోవడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.. కీపిటప్ అవసరాల..!!
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: ఏషియన్ లక్ష్మీకళ (మూసాపేట)

No comments:

Post a Comment