Thursday, 1 September 2016

JANATHA GARAGE REVIEW

జనతా గ్యారేజ్ రివ్యూ: అభిమానుల గ్యారేజ్
రేటింగ్: 3/5
అభిమానులు ఎంతగానో వేచిచూసిన గ్యారేజ్ వచ్చేసింది. ఎన్టీఆర్ నుంచి సింహాద్రి తర్వాత టోటల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా రాలేదనుకుంటున్న తరుణంలో జనతా గ్యారేజ్ చేశాడు. మిర్చి, శ్రీమంతుడు తర్వాత కమర్షియల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న కొరటాల శివ మూడో సినిమాగా జనతా గ్యారేజ్ చేశాడు. అయితే అటు ఎన్టీఆర్.. ఇటు కొరటాల శివ.. జనతా గ్యారేజ్ ద్వారా అనుకున్నది సాధించారా.. లేదా?.. ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం పదండి..
బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చిన సత్యం (మోహన్ లాల్).. ఓ బృందంతో కలిసి జనతా గ్యారేజ్ స్థాపిస్థాడు. అయితే సామాజిక ధృక్పథం కలిగిన సత్యం వాహనాలతో పాటు ప్రజల సమస్యలను కూడా రిపేర్ చేస్తుంటాడు. ఆ సమయంలోనే తమ్ముడిని కోల్పోతాడు. దీంతో కలతచెందిన సత్యం తమ్ముడి కొడుకు ఆనంద్ నెలల పిల్లాడిగా ఉన్నప్పుడే మావయ్య(సురేష్)తో కలిసి ముంబై పంపిస్తాడు. తమ్ముడిని కోల్పోయినా మార్పులేని సత్యం తన జీవితాన్ని అలానే కొనసాగిస్తుంటాడు. పర్యావరణ ప్రేమికుడిగా పెరిగి పెద్దయిన ఆనంద్.. మావయ్య కూతురు బుజ్జితో ప్రేమలో పడతాడు. అనుకోని కారణాల వల్ల హైదరాబాద్ వెళ్లిన ఆనంద్.. జనతా గ్యారేజ్ లో ఎలా ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.
తొలి రెండు చిత్రాల్లో కథతో పాటు బలమైన కథనాన్ని రాసుకున్న కొరటాల.. జనతా గ్యారేజ్ విషయానికి వచ్చేసరికి కొంచెం తడబడ్డాడు. కథ ఎలా ఉన్నా.. కథనం ఎలా చెప్పామనేదే ముఖ్యం. అయితే కథనం మరీ స్లోగా ఉండటం వల్ల సామాన్య ఆడియన్ భారంగా ఫీలవుతాడు. ఫస్టాఫ్ ను కొంచెం బాగానే తీసిన కొరటాల సెకండాఫ్ తొలి 20 నిమిషాలు వారెవ్వా అనిపించాడు. పక్కా లోకల్ సాంగ్ తర్వాతే కథనం పూర్తిగా గాడితప్పింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో కొరటాల కాన్ఫిడెంట్ లెవల్స్ దారుణంగా ఉన్నాయి. ఏదో తీశామంటే తీశామని ముగించారు. సినిమాలో అసలు విలనిజం పండకపోతే హీరోలు మాత్రం ఏంచేస్తారులేండి.
ఇక సినిమాను 70 శాతం నడిపించింది సీనియర్ నటుడు మోహన్ లాల్. ఎన్టీఆర్ కంటే ఎక్కువ స్క్రీన్ ప్రజన్స్ సత్యం క్యారక్టర్ కు ఉంది. మాస్ లుక్ లో ఎన్టీఆర్ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. సమంత, నిత్యామీనన్ లకు తిప్పికొడితే 15 నిమిషాల పాత్రలు కూడా లేవు. పక్కాలోకల్ సాంగ్ లో కాజల్ ఊపేసింది. మోహన్ లాల్ కుమారుడిగా ఉన్ని ముకుందన్ ఫర్వాలేదనిపించాడు. ముసలి విలన్ గా చేసిన సచిన్ కేడ్కర్ పాత్రలో విలనిజం పండలేదు. మిగతా పాత్రల్లో సురేష్, సితార, దేవయాని, సాయికుమార్, రాజీవ్ కనకాల తమ పరిధుల్లో నటించారు.
ఇక సాంకేతికవర్గానికొస్తే తన సంగీతంతో దేవిశ్రీప్రసాద్ సినిమాను 100 శాతం నిలబెట్టాడు. తిరు ఫొటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఎటొచ్చీ కొరటాలే తన కథనం బలంగా రాసుకోలేకపోయాడు.
ఓవరాల్ గా చెప్పాలంటే జనతా గ్యారేజ్ ను బాగోలేదని చెప్పలేం.. సూపర్బ్ గా ఉందనీ చెప్పలేం. అంచనాలు లేకుండా వెళ్తే జనతా గ్యారేజ్ బాగానే మెప్పిస్తాడు. ఎటోచ్చీ అభిమానులు జనతా గ్యారేజ్.. ఇక్కడ రికార్డులు సృష్టించబడును అనే క్యాప్షన్లతో ఊదరగొట్టారు. ప్రస్తుత సిట్యుయేషన్ బట్టి చూస్తే టెంపర్, నాన్నకు ప్రేమతో తర్వాత ఫుల్ మాస్ ప్యాక్ తో వచ్చిన ఎన్టీఆర్ కు హ్యాట్రిక్ లభించినట్టే చెప్పాలి.
కొసమెరుపు: నిత్యామీనన్ క్యారక్టర్ దీపావళితో ప్రారంభమై.. మళ్లీ ఏడాది తర్వాత దీపావళితోనే ముగియడం విశేషం.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: ముక్తా రామకృష్ణ (అబిడ్స్)

No comments:

Post a Comment